ఏపీ కేబినెట్ సమావేశంలో చర్చించే అంశాలివే

రాజకీయం
25 Views

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మంత్రి మండలి సమావేశం కానుంది. 2020, జూన్ 11వ తేదీ గురువారం ఉదయం 11 గంటలకు సెక్రటేరియట్‌లో సీఎం జగన్‌ అధ్యక్షత ఈ సమావేశం జరుగనుంది. బడ్జెట్‌ సమావేశాలే ప్రధాన అజెండగా ఈ భేటీలో మంత్రులు చర్చించనున్నారు.

ఈ మధ్యకాలంలో ఏపీ ప్రభుత్వానికి హైకోర్టుతోపాటు.. సుప్రీంకోర్టులోనూ చుక్కెదురవుతోంది. దీనిపై కేబినెట్‌ చర్చించే అవకాశముంది. కోర్టు జడ్జిమెంట్‌లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రావడం… ప్రతిపక్షాలకు ఆయుధంగా మారుతుండడంతో… ఏం చేయాలన్నదానిపై చర్చించనుంది. నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ కేసులో సుప్రీంకోర్టు ఆదేశాలపై ఏం చేయాలన్న దానిపైనా మంత్రిమండలి సభ్యులు చర్చించనున్నారు. గతంలో ఏ ప్రభుత్వ నిర్ణయాల మీద కూడా ఇన్ని పిల్స్‌ కోర్టులో వేయలేదు. ఈ సమస్యలు భవిష్యత్తులో రాకుండా ఏం చేయాలన్న దానిపై చర్చించే చాన్స్‌ ఉంది.

ఇక కరోనా వైరస్‌ వ్యాప్తిని తగ్గించడం, ఇంతవరకు కరోనా కట్టడికి తీసుకున్న చర్యలపైనా కేబినెట్‌ చర్చించనుంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంపై వస్తున్న అవినీతి ఆరోపణలపైనా చర్చ జరుగనుంది. ఖరీఫ్‌ సీజన్‌లో వేసే పంటలకు విత్తనాలు, ఎరువులు సరఫరా చేయడంపైనా కేబినెట్‌లో చర్చించనున్నారు. వర్షాకాలంలో భవన నిర్మాణాలకు ఇసుక కొరత లేకుండా తీసుకోవాల్సిన చర్యలపైనా మంత్రిమండలి చర్చించనుంది.

జల వివాదాలపైనా ఈ భేటీలో చర్చించనున్నారు. ప్రధానంగా తెలంగాణ ప్రభుత్వంతో వస్తున్న ఇబ్బందులపై ఈ సమావేశంలో చర్చించే అవకాశముంది. ఇక ప్రభుత్వం త్వరలో చేపట్టనున్న సమగ్ర భూముల సర్వే, శాసనమండలి రద్దు, విశాఖలో ఎగ్జిక్యూటివ్‌ రాజధాని నిర్మాణంపై నిర్ణయాలు తీసుకోనున్నారు. పర్యావరణ పరిరక్షణ బిల్లుతో పాటు మరికొన్ని బిల్లులకు కేబినెట్‌ ఆమోదముద్ర వేయనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *