అలీబాబాలో 10 నెలల్లో 5 వేల ఉద్యోగాలు

బిజినెస్‌
42 Views

న్యూఢిల్లీ: అన్‌లైన్‌ డిజిటల్‌ ప్లాట్‌ఫాంలో ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన సంస్థల్లో ఆలీబాబా అగ్రస్థానంలో ఉన్నది. రానున్న రోజుల్లో సంస్థను మరింత విస్తరించేందుకు ప్రణాళికలు సిద్దం చేసినట్లు తెలుస్తున్నది. రానున్న మూడేండ్లలో నెక్స్ట్‌ జనరేషన్‌ డాటా సెంటర్లను స్థాపించేందుకు 28 బిలియన్‌ డాలర్లు పెట్టుబడిగా పెట్టనున్నట్టు గత ఏప్రిల్‌ నెలలో సంస్థ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రానున్న 10 నెలల కాలంలో 5 వేల ఉద్యోగాలను భర్తీ చేసుకొనేందుకు సంస్థ నిర్ణయించింది. నెట్‌వర్క్‌, డాటాబేస్‌, సర్వర్స్‌, చిప్‌, ఏఐ విభాగాలను పటిష్ఠపరిచేందుకు చర్యలు చేపట్టింది.

గతంలో చైనాలో వ్యాపారాల కోసం పరివర్తన ప్రయాణం మూడు నుంచి ఐదేండ్లు పడుతుండగా ఇప్పుడు సంవత్సరం పడుతున్నదని అలీబాబా క్లౌడ్‌ ఇంటెలిజెన్స్‌ విభాగం అధ్యక్షుడు జెఫ్‌ జాంగ్‌ తెలిపారు. అన్ని రంగాల్లో గ్లోబల్‌ క్లయింట్ల నుంచి డిజిటల్‌షిప్ట్‌ యొక్క వేగంగా పెరుగుతున్న డిమాండ్‌ దృష్ట్యా ప్రపంచ స్థాయి క్లౌడ్‌ సేవలను అందించే నిబద్ధతతో కొనసాగాలని నిర్ణయించుకొన్నామన్నారు. మెషిన్‌ ఇంటెలిజెన్స్‌, విజన్‌ కంప్యూటింగ్‌, నేచురల్‌ లాంగ్వేజ్‌ ప్రాసెసింగ్‌, హ్యూమన్‌-మెషిన్‌ ఇంటరాక్షన్‌, ఐవోటీ, ఫైనాన్షియల్‌ టెక్నాలజీ రంగాల్లో ప్రాథమిక సాంకేతిక పరిశోధన కోసం 2017లో అలీబాబా డామో అకాడమీని స్థాపించారు. గత కొన్నేండ్లుగా అలీబాబా డామో అకాడమీ నుంచి స్పీచ్‌ ఏఐ, ఇమేజ్‌ సెర్చ్‌, సిటి ఇమేజ్‌ అనలిటిక్స్‌ సహా పలు మార్గదర్శక సాంకేతికతలు ప్రపంచానికి అందించారు. ఇప్పటివరకు 63 జోన్లలో అలీబాబా క్లౌడ్‌ సేవల లభ్యత ఉండగా.. వీటిలో రెండు భారత్‌లో ఉన్నాయి. 21 ప్రాంతాల్లో ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది వినియోగదారులకు సేవలందిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *