కేటీఆర్‌కు ఏపీ మంత్రి బొత్స ఫోన్‌

రాజకీయం
5 Views

అమరావతి: హైదరాబాద్‌లో హాస్టళ్లు, మెస్‌ల మూసివేత, ఏపీ విద్యార్థుల అగచాట్ల అంశాన్ని తెలంగాణ ప్రభుత్వం దృష్టికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకెళ్లింది. ఈ సందర్భంగా తెలంగాణ ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌తో ఏపీ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఫోన్‌లో మాట్లాడారు. హాస్టళ్ల నుంచి ఖాళీ చేయించడంతో వారికి రవాణా పరమైన ఇబ్బందులు వస్తాయని, అంతేకాకుండా కరోనా విజృంభిస్తున్న వేళ ఒక చోట నుంచి ఇంకో చోటకు కదలడం శ్రేయస్కరం కాదని కేటీఆర్‌ దృష్టికి మంత్రి బొత్స తీసుకెళ్లారు. ఇక ఇదే విషయంపై తెలంగాణ సీఎస్‌ సోమేష్‌ కుమార్‌తో ఏపీ సీఎస్‌ నీలం సాహ్ని మాట్లాడారు. ప్రత్యేకంగా పోలీసులు పాసులు ఇస్తున్న ఘటనలను కూడా తమ దృష్టికి వచ్చిందని సోమేష్‌ కుమార్‌ వద్ద నీలం సాహ్ని ప్రస్తావించారు.

సమస్యలు ఉంటే 1902కు కాల్‌ చేయ్యండి
హైదరాబాద్‌లో ఉంటున్న ఏపీ విద్యార్థులు, ప్రయివేట్‌ సంస్థల్లో పనిచేస్తున్న వారు ఎక్కడి వారు అక్కడే ఉండాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. కరోనా వైరస్‌ వేగంగా వ్యాపిస్తున్న సమయంలో బయటకు రావొద్దని హాస్టలర్స్‌ను కోరింది. ఏపీలోని తమ కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఎక్కడి వారు ఆక్కడే ఉండాలని పేర్కొంది. అదేవిధంగా ఏమైనా సమస్యలు ఉంటే 1902కు కాల్‌ చేయమని ప్రభుత్వం కోరింది. కాగా, లాక్‌డౌన్‌ సందర్భంగా హైదరాబాద్‌లోని హా​స్టళ్లు మూసివేస్తున్నారని ఉదయం నుంచి ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. దీంతో అయోమయానికి గురైన హాస్టలర్స్‌ తమను సొంత ఊళ్లకు పంపించాలని పోలీస్‌ స్టేషన్స్‌కు క్యూ కట్టారు. అయితే హాస్టళ్ల మూసివేత అసత్య ప్రచారమని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేయడంతో విద్యార్థులకు ఊరట లభించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *