నేటి అర్ధరాత్రి నుండి విమానాలు రద్దు, టిక్కెట్ రద్దుకు నో క్యాన్సిలేషన్ ఫీజు

బిజినెస్‌
10 Views

కరోనా వైరస్ వ్యాప్తి నిరోధించడంలో భాగంగా ఈ రోజు అర్ధరాత్రి గం.12.00 నుండి దేశీయ విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ నిర్ణయించిన విషయం తెలిసిందే. దీంతో నేటి అర్ధరాత్రి నుండి (25వ తేదీ) అన్ని విమానాలు క్యాన్సిల్ అవుతున్నాయి. అర్ధరాత్రి గం.11.59 సమయానికి గమ్య స్థానాలకు చేరుకునేలా ప్రణాళికలు రూపొందించుకోవాలని విమానయాన సంస్థలకు సూచించింది. తదుపరి ఆదేశాల వరకు విమాన సర్వీసులను నిలిపివేయాలి. ఇప్పటికే అంతర్జాతీయ సర్వీసులను వారం రోజుల పాటు నిలిపివేసింది కేంద్ర ప్రభుత్వం.

ఈ నేపథ్యంలో వివిధ విమానయాన సంస్థలు కస్టమర్లకు విమానాలు రద్దు చేస్తున్నట్లు సమాచారం పంపించాయి. కరోనా మహమ్మారి వ్యాప్తి నిరోధించేందుకు ప్రభుత్వానికి మద్దతుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాయి. ఇండిగో సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రోనో దత్తా కూడా కస్టమర్లకు లేఖ రాశారు. మార్చి 25, 2020 మంగళవారం అర్ధరాత్రి గం.11.59 సమయానికి అన్ని విమానాలు ఆయా ప్రాంతాల్లో దిగేలా చర్యలు తీసుకున్నామన్నారు.

కొద్ది వారాల పాటు తమ సేవలు నిలిచిపోతున్నాయని, ఇప్పటి వరకు బుక్ చేసిన టిక్కెట్లతో సెప్టెంబర్ 30వ తేదీ వరకు ప్రయాణించవచ్చునని, ఏప్రిల్ 30వ తేదీ లోపు బుక్ చేసుకున్న వారు క్యాన్సిల్ చేసుకోవచ్చునని, క్యాన్సిలేషన్ ఫీజు ఏమీ ఉండదని తెలిపారు.సెప్టెంబర్ 30వ తేదీలోపు బుక్ చేసుకున్న వారు జీరో క్యాన్సిలేషన్ ఫీజుతో మార్చుకోవచ్చునని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *