ఐపీఎల్ 2020 రద్దు?!

క్రీడలు
9 Views

ఐపీఎల్ 2020 సీజన్ రద్దవడం ఇక లాంఛనంగానే కనిపిస్తోంది. మార్చి 29న ప్రారంభంకావాల్సిన ఐపీఎల్ 2020 సీజన్.. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఏప్రిల్ 15 వరకూ వాయిదా పడగా.. అప్పటిలోపు దేశంలో పరిస్థితులు అదుపులోకి వచ్చే సూచనలు లేకపోవడంతో టోర్నీని రద్దు చేయాలని బీసీసీఐ అధికారులు నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి ఐపీఎల్‌ 2020 సీజన్‌ని ఏప్రిల్ 15 వరకూ ఇటీవల వాయిదా వేసిన భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ).. తదుపరి కార్యాచరణపై టోర్నీలోని ఎనిమిది ఫ్రాంఛైజీలతో మంగళవారం (మార్చి 24) వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడాలని నిర్ణయించింది. కానీ.. ఈరోజు షెడ్యూల్ కంటే కొన్ని నిమిషాల ముందు వీడియో కాన్ఫరెన్స్‌ని రద్దు చేస్తున్నట్లు ఫ్రాంఛైజీలకి బీసీసీఐ సమాచారం అందించడంతో ఇక ఐపీఎల్ నిర్వహణ సాధ్యంకాదంటూ ఓ ఫ్రాంఛైజీ అధికారి తేల్చేశారు. భారత్‌లో మంగళవారం మధ్యాహ్నానికి కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 523కి చేరుకోగా.. ఐపీఎల్ మ్యాచ్‌లు జరిగే ప్రధాన రాష్ట్రాల్లోనే ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. దీంతో.. ఏప్రిల్ రెండో వారానికి దేశంలో పరిస్థితులు అదుపులోకి వచ్చే సూచనలు కనిపించడం లేదు.

మరోవైపు పర్యాటక వీసాల్ని ఏప్రిల్ 15 వరకూ కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడంతో విదేశీ క్రికెటర్లు అప్పటిలోపు భారత్‌కి వచ్చే అవకాశం లేదు. దీంతో.. ఐపీఎల్‌ని రద్దు చేయడం మినహా మరో ప్రత్యామ్నాయ మార్గమేమీ బీసీసీఐ ముందు కనిపించడం లేదు. జపాన్ వేదికగా జులైలో జరగాల్సిన టోక్యో ఒలింపిక్స్ ఇప్పటికే కరోనా దెబ్బకి వాయిదా పడే సూచనలు కనిపిస్తుండగా.. అన్ని దేశాలు స్పోర్ట్స్ ఈవెంట్స్‌ని రద్దు చేశాయి. బ్రిటన్‌లో కరోనా వైరస్ పతాక స్థాయికి చేరుకోవడంతో.. ఇంగ్లాండ్ వేల్స్ క్రికెట్ బోర్డు ఏకంగా మే నెల వరకూ ఎలాంటి క్రికెట్‌ మ్యాచ్‌లు నిర్వహించబోమని ప్రకటించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *