‘సెలెక్ట్‌’ గేమ్‌!

ఆంధ్రప్రదేశ్
72 Views

ఆంధ్రప్రదేశ్‌ శాసన మండలిలో ప్రభుత్వం ప్రతిపాదించిన పాలనా వికేంద్రీకరణ (మూడు రాజధానులు), రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సిఆర్‌డిఎ) చట్ట ఉపసంహరణ బిల్లులు, సెలెక్టు కమిటీ వ్యవహారంపై అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపి తమ రాజకీయ స్వప్రయోజనాలకు వాడుకుంటున్నాయని విమర్శలొస్తున్నాయి. రాజ్యాం గం, చట్టాలు, చట్ట సభల రూల్స్‌కు వ్యతిరేకంగా, ఇష్టారీతిన వ్యాఖ్యానాలు, భాష్యాలు వల్లిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు, న్యాయ నిపుణులు, ప్రజాస్వామ్యవాదులు అభిప్రాయపడు తున్నారు. సదరు రెండు పార్టీలూ వాస్తవ విషయాలను మరుగునపర్చి ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాయని అసంతృప్తి చెందుతున్నారు. రాజకీయ ఎత్తుల్లో వ్యవస్థలను ధ్వంసం చేసే దుర్మార్గానికి వైసిపి, టిడిపి బరితెగించాయని ఆందోళన చెందుతున్నారు. రాజ్యాంగంలోని అధికరణ 158(1) ప్రకారం చట్ట సభల్లో ఏదైనా బిల్లు కాని, తీర్మానం కాని వస్తే ఏకగ్రీవంగానో, ఓటింగ్‌ ద్వారానో ఆమోదించి తీరాలి. అటువంటిదేదీ మండలిలో జరగలేదు. ఏకగ్రీవంగాకానీ, ఓటింగ్‌ ద్వారాకానీ బిల్లులు సెలెక్టు కమిటీకి వెళ్లలేదు. మండలి రూల్స్‌ ప్రకారం ఛైర్మన్‌కు ఉన్న విచక్షణాదికారం ఏదైనా నోటీసును సకాలంలో ఇవ్వలేకపోతే, దానికి మినహాయింపులు ఇవ్వడం వరకే. సభ్యుల ఆమోదం లేకుండా బిల్లులను సెలెక్టు కమిటీకి పంపే నిర్ణయం ఛైర్మన్‌ చేతిలో లేదు. సెలెక్టు కమిటీకి ఛైర్మన్‌ పంపించాననడం సరైన ప్రొసీజర్‌ అవదు. ఛైర్మన్‌ సభను నిరవధిక వాయిదా వేయకుండా, తాత్కాలిక వాయిదా వేసి, ఒకటి రెండు రోజుల్లో సభను సమావేశపర్చి, సభ్యుల ఆమోదం తీసుకొని సెలెక్టు కమిటీకి పంపితే బాగుండేది. ఆవిధంగా కాకుండా ఛైర్మన్‌, టిడిపి అనాలోచితంగా వ్యవహరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *