వీఆర్వోపై మట్టి మాఫియా దాడి

తెలంగాణ
21 Views

ఇసుక, మట్టి అక్రమ రవాణాను అడ్డుకునేందుకు వెళ్లిన వీఆర్వోపై మట్టి మాఫియా దుండగులు దాడి చేశారు. వారి బారి నుంచి వీఆర్వో తప్పించుకున్న ప్పటికీ అతని బైక్‌ను తగులబెట్టారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో శుక్రవారం జరిగింది. బాధితుని వివరాల ప్రకారం.. సంగారెడ్డి మండలం హనుమాన్‌నగర్‌, ఇస్మాయిల్‌ ఖాన్‌పేట, గౌడిచర్ల తదితర గ్రామాల్లో అక్రమంగా మట్టి, ఇసుక రవాణా సాగుతోంది. ఈ నేపథ్యంలో తెల్లవారుజామున ఇస్మాయిల్‌ ఖాన్‌పేట పరిధిలో అక్రమంగా మట్టి, ఇసుక రవాణా జరుగుతోందని వీఆర్వో చింతపల్లి పెంటయ్యకు సమాచారమొచ్చింది. వెంటనే ఆయన బైక్‌పై హనుమాన్‌ నగర్‌ పరిధిలోని పాలిటెక్నిక్‌ కళాశాల దగ్గర నుంచి వెళుతుండగా నలుగురు ముసుగు వేసుకున్న దుండగులు దాడి చేశారు. దాంతో వీఆర్వో బైక్‌ను అక్కడే వదిలేసి వారి నుంచి తప్పించుకున్నాడు. ఉన్నతాధికారులకు సమాచారమిచ్చాడు. వారొచ్చేసరికే దుండగులు బైక్‌ను దహనం చేసి పోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు చేపట్టారు. రెవెన్యూ ఉన్నతాధికారులు ఆర్‌ఐ ప్రసాద్‌, సీనియర్‌ అసిస్టెంట్‌ శ్రీనివాస్‌, వీఆర్వోలు సంతోష్‌, శివరాం, వీఆర్‌ఏలు లక్ష్మణ్‌, రాములు, ఈశ్వర్‌, యాదగిరి కూడా ఘటనా స్థలాన్ని పరిశీలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *