భారత షట్లర్ల సత్తా

క్రీడలు
26 Views

మనీలా: ఆసియా బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌ క్వార్టర్‌ఫైనల్లో భారత షట్లర్లు సత్తా చాటారు. తొలి రెండు సింగిల్స్‌లో ఓడి 0-2తో వెనుకబడినా.. తర్వాత జరిగిన రెండు డబుల్స్‌, ఒక సింగిల్స్‌ మ్యాచ్‌లో గెలిచి 3-2తో థారులాండ్‌ను ఓడించి సంచలనం సృష్టించారు. తొలి సింగిల్స్‌ పోటీలో బి. సాయి ప్రణీత్‌ 14-21, 21-14, 12-21తో వాంగ్‌ ఛరోన్‌ చేతిలో మూడుసెట్ల హోరాహోరీ పోరులో ఓడాడు. రెండో సింగిల్స్‌ పోటీలో కిదాంబి శ్రీకాంత్‌ 20-22, 14-21తో విటిడ్సరన్‌(థారు) చేతిలో వరుససెట్లలో ఓటమిపాలవ్వడంతో థారు సునాయాసంగా సెమీఫైనల్లోకి చేరుతుందని ఊహించారు. కానీ ఆ తర్వాత జరిగిన పురుషుల డబుల్స్‌ పోటీలో అర్జున్‌-ధృవ్‌ కపిల జోడీ 21-18, 22-20తో కెండ్రెన్‌-తనుపట్‌ను ఓడించి థారు ఆధిక్యతను 2-1కు తగ్గించారు. నాల్గోమ్యాచ్‌ సింగిల్స్‌ పోటీలో లక్ష్యసేన్‌ 21-19, 21-18తో సుపన్యూను ఓడించి మ్యాచ్‌ను 2-2తో సమం చేశాడు. నిర్ణయాత్మక చివరి డబుల్స్‌ పోటీలో కిదాంబి శ్రీకాంత్‌-చిరాగ్‌ శెట్టి జోడీ 21-15, 16-21, 21-15తో జోంగ్జిత్‌-నిపిట్పోన్‌పై చెమటోడ్చి నెగ్గి భారత్‌కు సెమీస్‌ బెర్త్‌ ఖాయం చేశారు. సెమీస్‌కు చేరడంతో భారతజట్టుకు కనీసం కాంస్య పతకం దక్కనుంది. అంతకుముందు 2016 హైదరాబాద్‌లో జరిగిన టోర్నీలో భారత్‌ తొలిసారి కాంస్య పతకం గెల్చింది. ఇతర పోటీల్లో ఇండోనేషియా 3-0తో ఫిలిప్పీన్స్‌ను, జపాన్‌ 3-1తో చైనీస్‌ తైపీను, మలేషియా 3-0తో దక్షిణ కొరియాను ఓడించి సెమీస్‌ బెర్త్‌లు ఖాయం చేసుకున్నాయి. శనివారం జరిగే సెమీస్‌ పోటీలో భారతజట్టు ఇండోనేషియాతో, జపాన్‌జట్టు మలేషియాతో తలపడనున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *