నసీమ్‌ షా రికార్డు హ్యాట్రిక్‌

క్రీడలు
96 Views

రావల్పిండి: టీనేజ్‌ పేసర్‌ నషీమ్‌ షా (4/26) రికార్డు హ్యాట్రిక్‌తో చెలరేగడంతో పాకిస్థాన్‌తో తొలి టెస్ట్‌లో బంగ్లాదేశ్‌ ఓటమి దిశగా పయనిస్తోంది. పర్యాటక జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 124/2తో పోరాడుతున్న దశలో నసీమ్‌ షా వరుసగా మూడు వికెట్లు తీసి ప్రత్యర్థిని దెబ్బకొట్టాడు. దాంతో బంగ్లాదేశ్‌ 126/6తో కష్టాల్లో కూరుకుపోయింది. పాకిస్థాన్‌ తొలి ఇన్నింగ్స్‌ స్కోరుకు ఇంకా 86 పరుగులు వెనుకంజలో ఉండగా..బంగ్లా చేతిలో 4 వికెట్లే ఉన్నాయి. 16 ఏళ్ల 359 రోజుల్లో హ్యాట్రిక్‌ తీసిన నసీమ్‌..బంగ్లాదేశ్‌కు చెందిన అలోక్‌ కపాలి రికార్డును బద్ధలుగొట్టాడు. 19 ఏళ్ల వయస్సులో పాకిస్థాన్‌పైనే 2003లో కపాలి ఆ రికార్డు నెలకొల్పడం విశేషం. అంతకుముందు ఓవర్‌నైట్‌ 342/3తో మూడోరోజు మొదటి ఇన్నింగ్స్‌ కొనసాగించిన పాకిస్థాన్‌ 445 పరుగులకు ఆలౌటైంది. దాంతో ఆతిథ్య జట్టుకు 212 పరుగుల ఆధిక్యం లభించింది. బంగ్లాదేశ్‌ మొదటి ఇన్నింగ్స్‌లో 233 పరుగులు చేసింది.

బంగ్లాదేశ్‌ మొదటి ఇన్నింగ్స్‌: 233, రెండో ఇన్నింగ్స్‌: 126/6 (నజ్ముల్‌ 38, మోమినుల్‌ 37 నాటౌట్‌, నసీమ్‌ షా 4/26, యాసిర్‌ షా 2/33). పాకిస్థాన్‌ తొలి ఇన్నింగ్స్‌: 445 (బాబర్‌ ఆజమ్‌ 143, షాన్‌ మసూద్‌ 100, రిస్‌ సొహైల్‌ 75, అబూ జాయెద్‌ 3/86, రూబెల్‌ హొస్సేన్‌ 3/113, తైజుల్‌ ఇస్లాం 2/139).

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *