తహశీల్దార్‌ కార్యాలయం వద్ద గిరిజన రైతుల ధర్నా

ఆంధ్రప్రదేశ్
97 Views

విజయనగరం జిల్లా పాచిపెంట మండలం కొట్టూరు పంచాయతీ కూడుమూరు రెవెన్యూలోని సర్వే నెంబర్‌ 48లో 782 ఎకరాల ప్రభుత్వ భూమిని తరతరాలుగా సాగుచేస్తున్న గిరిజన రైతులకు సాగుపట్టాలివ్వాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి వి.వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో గురువారం పాదయాత్ర నిర్వహించారు. సుమారు వంద మందికి పైగా గిరిజన రైతులతో కూడుమూరు నుంచి పాచిపెంట తహశీల్దార్‌ కార్యాలయం వరకూ సుమారు 18 కిలో మీటర్లు పాదయాత్ర చేశారు. అనంతరం స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ ధర్నానుద్దేశించి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కూడుమూరు రెవెన్యూ పరిధిలో కూడుమూరు, తోటమెట్ట, మెట్టవలస, ఇప్పలవలస, కిమిడివలస, కొండతాడూరు, కన్నయ్యవలస, రిట్టలపాడు, వేటగానివలస గ్రామాలకు చెందిన సుమారు 200 గిరిజన కుటుంబాలు తరతరాల నుంచి సర్వే నెంబర్‌ 48లో 782 ఎకరాల ప్రభుత్వ భూముని సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారన్నారు. అయితే వీరికి ప్రభుత్వం ఇప్పటి వరకూ ఎలాంటి హక్కులు కల్పించలేదని తెలిపారు. దీంతో వీరికి రైతుభరోసా, ఇతర సబ్సిడీలు అందడం లేదన్నారు.

అధికారులు స్పందించి సాగుభూమిని సర్వే చేసి సాగులో ఉన్నవారందరికీ పట్టాలు మంజూరు చేయాలని కోరారు. అనంతరం తహశీల్దార్‌ ఎంవి.రమణమూర్తికి వినతిని అందజేశారు. దీనికి స్పందించిన తహశీల్దార్‌ పట్టాలిస్తామని లిఖిత పూర్వకంగా హామీ ఇచ్చారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మికసంఘం జిల్లా ఉపాధ్యక్షులు రెడ్డి శ్రీరామ్మూర్తి, నాయకులు ఎరుకుల తవిటినాయుడు, మర్రి శ్రీనివాసరావు, గిరిజన రైతులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *