ప్రపంచ క్రికెట్లో సరికొత్త సంచలనం లబుస్‌చగ్నె

క్రీడలు
200 Views

ప్రపంచ టెస్టు క్రికెట్‌లో ఆస్ట్రేలియా యువ సంచనలం మార్నస్ లబుస్‌చగ్నె ప్రకంపనలు సృష్టిస్తున్నాడు. ఐసిసి తాజా ర్యాంకింగ్స్‌లో ఏకంగా 8వ ర్యాంక్‌కు చేరుకోవడం ద్వారా సరికొత్త స్టార్‌గా అవతరించాడు. పాకిస్థాన్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో లబుస్‌చగ్నె పరుగుల వరద పారించాడు. డేవిడ్ వార్నర్‌తో కలిసి పాకిస్థాన్ బౌలింగ్‌ను ఊచకోత కోశాడు. దీంతో ఐసిసి తాజా ర్యాంకింగ్స్‌లో ఏకంగా 8వ ర్యాంక్‌కు చేరుకుని చరిత్ర లిఖించాడు. ఈ ఏడాది ఆరంభంలో లబుస్‌చగ్నె ర్యాంకింగ్స్‌లో టాప్100లో కూడా లేడు. అయితే యాషెస్ సిరీస్ నుంచి లబుస్‌చగ్నె అసాధారణ బ్యాటింగ్‌తో పరుగుల వరద పారిస్తున్నాడు.

ఆడింది కొన్ని మ్యాచులే అయినా భారీ స్కోర్లతో జట్టుపై తనదైన ముద్ర వేశాడు. ఐసిసి బుధవారం విడుదల చేసిన ర్యాకింగ్స్‌లో ఏకంగా 8వ స్థానాన్ని దక్కించుకున్నాడు. ఈ క్రమంలో 11 టెస్టుల్లోనే 53.53 సగటుతో 920 పరుగులు సాధించాడు. యాషెస్ సిరీస్‌లో స్మిత్ గాయపడడంతో కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా లబుస్‌చగ్నె బరిలోకి దిగాడు. ఆ తర్వాత అతని ఆట తీరు ఒక్కసారిగా మారిపోయింది.

అప్పటి వరకు అంతంత మాత్రంగానే రాణించిన లబుస్‌చగ్నె యాషెస్ సిరీస్ తర్వాత సరికొత్త స్టార్‌గా ఎదిగాడు. యాషెస్ సిరీస్‌లో అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పరుగుల వరద పారించాడు. యాషెస్ సిరీస్‌లో ఏకంగా మూడు అర్ధ సెంచరీలు కొట్టి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇక, పాకిస్థాన్‌తో జరిగిన తాజా సిరీస్‌లో వరుసగా రెండు టెస్టుల్లోనూ సెంచరీలతో ఆకట్టుకున్నాడు. బ్రిస్బేన్ టెస్టులో 185 పరుగులు చేసిన లబుస్‌చగ్నె, అడిలైడ్ వేదికగా జరిగిన డేనైట్ సమరంలో 162 పరుగులు సాధించాడు. ఈ ప్రదర్శనతో ఆస్ట్రేలియా స్టార్ ఆటగాళ్లలో ఒకడిగా లబుస్‌చగ్నె పేరు తెచ్చుకున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *